సిద్దిపేటలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతకు పిలుపు

సిద్దిపేటలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
 
ఏప్రిల్ 14: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ కె. హైమావతి, సీపీ సాధన రష్మీ పెరుమాళ్, ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్, డీఆర్ఓ నాగరాజమ్మ, ఆర్డీఓ సదానందం తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సభ వేదికపై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ ద్వారా రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన మహనీయుడని కొనియాడారు.రిజర్వేషన్ విధానం ద్వారా సమాన అవకాశాలు కల్పించాలన్న దూరదృష్టి అంబేద్కర్‌దని, సమాజంలో సమాన విద్యా, ఆరోగ్య అవకాశాలు అందరికీ లభించినప్పుడే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని తెలిపారు. ఆర్థిక రంగంలో కూడా విశేష కృషి చేసి రిజర్వ్ బ్యాంక్ స్థాపనలో కీలక ఆలోచనలు అందించిన మేధావి అని చెప్పారు.సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏసీఎల్బీ అబ్దుల్ రహమాన్ అంబేద్కర్ జీవితం నుంచి ఓర్పు, పట్టుదల వంటి విలువలను అలవరచుకోవాలని సూచించారు.అనంతరం ఎస్సీ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థిని కళాంజలి ప్రార్థిని (లిటిల్ మిస్ ఇండియా రన్నర్-అప్)ను సత్కరించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందజేసి, వ్యాసరచన పోటీలు మరియు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సంఘ నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News