వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కొయ్యూరు పీహెచ్‌సీలో అవగాహన ర్యాలీ
బెస్ట్ ఎంప్లాయీ - బెస్ట్ ఆశా కార్యకర్త కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న బీ గోపి, గంధం విజయలక్ష్మి
కొత్తగూడెం/చర్ల : లోకల్ గైడ్ :
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా చర్ల కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కలిసి మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు ఆరోగ్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక మాట్లాడుతూ “ఆరోగ్యమే మహాభాగ్యం” అని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం, నడక అలవాటు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు. మద్యం సేవించడం, పొగాకు నమలడం, సిగరెట్ తాగడం వంటి చెడు అలవాట్లు అనేక వ్యాధులకు కారణమవుతాయని, ఇవి అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయం కలిగిస్తాయని హెచ్చరించారు. అందువల్ల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ వంటి వ్యాధులను నివారించేందుకు దోమతెరలు వాడాలని తెలిపారు.
టీ-హబ్ ద్వారా నిర్వహించే రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, 30 సంవత్సరాలు పైబడిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సాధారణ పరీక్షలు, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నందున ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
బెస్ట్ ఎంప్లాయీ - బెస్ట్ ఆశా కార్యకర్త కలెక్టర్ చేతుల మీదు గా అవార్డులు అందుకున్న బీ గోపి, గంధం విజయలక్ష్మి
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బీ గోపి, ఆశా కార్యకర్త గంధం విజయలక్ష్మి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎంప్లాయీ’, ‘బెస్ట్ ఆశా కార్యకర్త’ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హారిక మాట్లాడుతూ ఈ అవార్డులు మన పీహెచ్‌సీకి రావడం గర్వకారణమని అన్నారు. టీ-హబ్ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ముందంజలో ఉండటానికి గోపి చేసిన సేవలను ప్రశంసించారు. అలాగే ఆశా కార్యకర్త గంధం విజయలక్ష్మి అధిక జనాభా ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయడం, గర్భిణీల నమోదు, టీకాల అమలు, టీబీ కేసుల ఫాలోఅప్, గౌట్ డెలివరీ మోటివేషన్ వంటి సేవల్లో చురుకుగా పనిచేసి ఈ అవార్డు అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు కలిసి అవార్డు గ్రహీతలను అభినందించారు.
