గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
ఏకలవ్య పాఠశాలలో లోపాలపై ఆగ్రహం – రెండు రోజుల్లో సరిచేయకపోతే గుర్తింపు రద్దు హెచ్చరిక
ఆరోగ్యం, విద్య, పశుసంవర్ధక రంగాలపై ప్రత్యేక దృష్టి – నాణ్యమైన సేవలందించాలని అధికారులకు ఆదేశాలు
కొత్తగూడెం : లోకల్ గైడ్ :
గుండాల మండలంలో ప్రభుత్వ సేవల నాణ్యతను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, పశుసంవర్ధక మరియు పరిపాలన రంగాలకు చెందిన పలు సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేసి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సమయానికి నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ముతాపురం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ తరగతి గదులు, ఆర్ఓ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యత, పాలు సరఫరా, పరీక్షల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. పరిశీలనలో పరిశుభ్రత లోపాలు, సిబ్బంది కొరత, కిచెన్లో అస్వచ్ఛత, కంప్యూటర్ ల్యాబ్ నిర్లక్ష్యం, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం వంటి సమస్యలను గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు రోజుల్లో అన్ని లోపాలను సరిచేయాలని, లేనిపక్షంలో గుర్తింపును రద్దు చేసి బ్లాక్లిస్ట్లో చేర్చుతామని కఠినంగా హెచ్చరించారు. విద్యార్థులకు ప్రతి భోజనం తాజాగానే వండి నాణ్యతతో అందించాలని సూచించారు. తదనంతరం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. మందుల పంపిణీ గదిలో సిబ్బంది లేకపోవడంపై ప్రశ్నించి, మందుల నిల్వ గదికి ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడం, ఫార్మసిస్ట్ను నియమించాలని ఆదేశించారు. డెంగ్యూ పరీక్ష కిట్లు, వేసవి కాలానికి అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి పనులను నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి, పనిచేయని ఆర్ఓ ప్లాంట్ను త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కిచెన్లో ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తూ మినరల్ వాటర్ వినియోగించాలని చెప్పారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల శుభాకాంక్షలు తెలిపారు. ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసి పశువులకు సమయానికి వైద్య సేవలు అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పశుపాలకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, టీకాలు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ ఖాసీమ్, మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ఎంపీడీవో బాలరాజు, పాఠశాలలు మరియు వైద్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
