ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ హైమావతి.
సిద్ధిపేట జిల్లా బ్యూరో
(లోకల్ గైడ్ తెలంగాణ) మార్చి 5:
జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంను 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం పగడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్ ఏఈలు, ఏపీఎంలతో జూమ్ సమావేశం నిర్వహించి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, వైద్యం, వనమహోత్సవం, తాగునీటి సరఫరా, రైతు భరోసా, మహాలక్ష్మి, గృహలక్ష్మి, రూ.500 గ్యాస్ సబ్సిడీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీలో పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రూఫ్ స్థాయిలో ఉన్నవాటిని త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ సంవత్సరం లబ్ధిదారుల ఎంపికలో పూరీ గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులను కొనసాగిస్తూ ఉపాధి హామీలో కూలీల శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ జనరేట్‌లో సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందిస్తూ రోజువారీగా మానిటరింగ్ చేయాలని డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్యను ఆదేశించారు.
