సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డిఎస్పీ శ్రీనివాసు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
ఏప్రిల్ 2:సిద్దిపేట సైబర్ క్రైమ్ డిఎస్పీ జి. శ్రీనివాసు సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేటలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్స్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్‌ను నమ్మవద్దని,పోలీసులమని చెప్పుతూ “డిజిటల్ అరెస్ట్” పేరుతో బెదిరించే మోసగాళ్ల మాటలకు లోనుకావద్దని తెలిపారు. చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదని స్పష్టం చేశారు.క్రిప్టో, ఫారెక్స్, స్టాక్స్ వంటి పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసే సంఘటనలు పెరుగుతున్నాయని, మొదట చిన్న లాభాలు చూపించి పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టించేలా మభ్యపెడుతున్నారని హెచ్చరించారు.అలాగే బ్యాంక్ అధికారులమని చెప్పి ఆధార్, పాన్ అప్‌డేట్ పేరుతో OTPలు, APK ఫైల్స్ పంపించి ఖాతాలను ఖాళీ చేసే మోసాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు, మెసేజ్‌లు ఓపెన్ చేయవద్దని చెప్పారు.సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదాwww.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చాట్‌బాట్ ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
