ప్రయాణికులపై డ్రైవర్ ప్రతాపం చేయి ఎత్తినా ఆగని ఆర్టీసీ చక్రం!
అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు ఆపని డ్రైవర్ ప్రశ్నిస్తే దురుసు ప్రవర్తన - టీజీఎస్ ఆర్టీసీ ప్రతిష్టకు భంగం
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల డిమాండ్
అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
ప్రజారవాణాలో అగ్రగామిగా, సామాన్యుడి నేస్తంగా పేరుగాంచిన టీజీఎస్ ఆర్టీసీ ప్రతిష్టకు కొందరు డ్రైవర్ల తీరు మచ్చ తెస్తోంది. ప్రయాణికులే దేవుళ్లు అని సంస్థ నినదిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు డ్రైవర్లు ప్రయాణికులను చిన్నచూపు చూస్తూ, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. సోమవారం అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రిక్వెస్ట్ స్టాప్ వద్ద మందలపల్లి వెళ్లేందుకు ప్రయాణికులు వేచి ఉన్నారు. సత్తుపల్లి డిపోకు చెందిన టీఎస్ 04 యూసి 0068 నంబర్ గల బస్సు రాగానే వారు ఆపమని చేయి ఎత్తారు. అయితే, ప్రయాణికులను చూసినప్పటికీ డ్రైవర్ మారేషు బస్సును ఆపకుండా వేగంగా వెళ్ళిపోయారు. డ్రైవర్ తీరుతో విస్తుపోయిన ప్రయాణికుడు వెంటనే మోటార్ సైకిల్‌పై బస్సును వెంబడించి మందలపల్లి వద్ద నిలదీశారు. బస్సు ఖాళీగా ఉన్నప్పటికీ ఎందుకు ఆపలేదని ప్రశ్నించగా, డ్రైవర్ అత్యంత దురుసుగా సమాధానమిచ్చారు. బస్సులో ఖాళీ లేదు వెనుక వచ్చే బస్సులో రండి అంటూ పొంతన లేని సమాధానం చెప్పడమే కాకుండా, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సవాల్ విసిరారు. తీరా బస్సు లోపల చూస్తే కేవలం సీట్లు మాత్రమే నిండి ఉండటం, నిలబడి ప్రయాణించేంత స్థలం ఉన్నా ఆపకపోవడం డ్రైవర్ నిర్లక్ష్యాన్ని చాటుతోంది. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేస్తుంటే, ఇలాంటి కొందరు సిబ్బంది ప్రవర్తన వల్ల సంస్థకు చెడ్డపేరు వస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రుల వద్ద రోగులు, మహిళలు బస్సు కోసం ఎదురుచూస్తుంటే ఆపకుండా వెళ్లడం అమానుషమని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై ఉదయ రాఘవేంద్ర సత్తుపల్లి డిపో మేనేజర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. నిబంధనలను అతిక్రమించి, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించిన డ్రైవర్ మారేషుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే ఆర్టీసీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
