పుట్టిన గడ్డ అభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐల భారీ విరాళం..
అమెరికా పర్యటనలో ఆనాడు ఎన్ఆర్ఐ లను కలిసిన ఎమ్మెల్యే నాయిని...
హనుమకొండ జిల్లా ఫిబ్రవరి24(లోకల్ గైడ్ న్యూస్)*:
శుక్రవారం రోజున కేఎంసీ మౌలిక సదుపాయాల కోసం రూ.10 కోట్లు ప్రకటించిన ప్రవాస భారతీయులు..
క్యాంపు కార్యాలయంలో మీడియ ముఖంగా అభినందించిన ఎమ్మెల్యే నాయిని.
స్వదేశం పట్ల మమకారం, పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో ఎన్‌ఆర్‌ఐల బృందం ముందుకు వచ్చిందని తెలియజేశారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.
శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గతంలో అమెరికాలో పర్యటించిన క్రమంలో అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ లను ప్రత్యేకంగా కలసి వరంగల్ వాసులుగా నగరానికి మీవంతు సహకారం అందించాలని కోరారు.ఈ మేరకు డాక్టర్ సుజీత్ కుమార్ నేతృత్వంలోని సుమారు 200 మంది ఎన్‌ఆర్‌ఐలు కలిసి కాకతీయ మెడికల్ కాలేజ్ (కేఎంసీ) మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.10 కోట్ల విరాళం అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వార్డులు, రోగుల కోసం అవసరమైన సౌకర్యాలు, విద్యార్థులకు శిక్షణ వనరులు వంటి అంశాలపై ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వేలాది మంది ప్రజలు కేఎంసీ ఎంజీఎం ఆసుపత్రులపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇవే ప్రధాన వైద్య కేంద్రాలు. ఈ విరాళం ద్వారా అత్యాధునిక సీటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి పరికరాల ఏర్పాటు, అత్యవసర వైద్య విభాగాల బలోపేతం, శస్త్రచికిత్స సదుపాయాల విస్తరణకు దోహదం కానుంది.
ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సదుపాయాలు, విద్యాసంస్థల అభివృద్ధి వంటి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలోనూ అదే దిశగా పురోగతి సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, “విదేశాల్లో స్థిరపడినా స్వగ్రామ అభివృద్ధి కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించడం గర్వకారణం. ఇది కేవలం విరాళం కాదు, వరంగల్ పశ్చిమ ప్రజల ఆరోగ్య భద్రతకు పెట్టుబడి” అని అన్నారు. ఎన్‌ఆర్‌ఐల సేవాభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.మన వరంగల్ నుంచి విద్యను అభ్యసించే విదేశాల్లో స్థిరపడిన అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కె ఎం సి ప్రిన్సిపాల్ సంధ్యారాణి,ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.
