మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
రోడ్డుపై ప్రమాదకర గుంతను పూడ్చివేసిన పోలీసులు....
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సాధారణ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు.రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న ఒక పెద్ద గుంతను గుర్తించిన పోలీసులు తక్షణమే స్పందించి ఆ గుంతను పూడ్చివేయించారు.మందమర్రి ప్రధాన రహదారిపై పోలీసులు పెట్రోలింగ్,వాహనాల తనిఖీలు చేపడుతున్న సమయంలో రోడ్డు అంచున ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న ఒక లోతైన గుంతను గమనించారు.ముఖ్యంగా రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులు ఈ గుంతను గమనించక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు,ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు చేపట్టారు.జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి రోడ్డు పక్కన ఉన్న మట్టి,రాళ్లతో ఆ గుంతను పూర్తిగా పూడ్చివేసి సమాంతరంగా చేశారు.పోలీసుల సమయస్ఫూర్తి వల్ల జరగబోయే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా మందమర్రి ఎస్సై జి నరేష్ మాట్లాడుతు శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడటం కూడా తమ బాధ్యతే అని,రాత్రి వేళల్లో ఈ గుంత వల్ల వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గుర్తించి వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.పోలీసుల ఈ చొరవను చూసి అటుగా వెళ్తున్న ప్రయాణికులు,స్థానిక ప్రజలు మందమర్రి పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
