అభివృద్ధి పేరుతో కొండంత నిర్లక్ష్యం. అశ్వారావుపేటలో నయవంచన పాలన!

​రెండు ఏళ్లుగా దుమ్ము మింగుతున్న జనం.చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పాలకులు. 

అభివృద్ధి పేరుతో కొండంత నిర్లక్ష్యం. అశ్వారావుపేటలో నయవంచన పాలన!

ముగ్గురు మంత్రులు ఉన్నా మారని సరిహద్దు రాత!

​అశ్వారావుపేట లోకల్ గైడ్ :

అభివృద్ధి అంటే రంగుల హంగులు కాదు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం. కానీ సరిహద్దు ప్రాంతమైన అశ్వారావుపేటలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. సెంట్రల్ లైటింగ్ పనుల పేరిట గత రెండేళ్లుగా సాగుతున్న కాలయాపన, రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోంది. ఎన్నికల వేళ ఓట్ల కోసం ఆరాటపడే నాయకులకు, ప్రజలు కాలుష్యపు కోరల్లో చిక్కుకొని ఊపిరితిత్తులు కలుషితమవుతున్నా పట్టకపోవడం గమనార్హం. ​ఒకవైపు పెరుగుతున్న పరిశ్రమలు, మరోవైపు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు పనులతో అశ్వారావుపేట కాలుష్య కోరల్లో చిక్కుకుందని చెప్పవచ్చు. రోడ్డు నిర్మాణంలో వాడే వైట్ మిక్స్ పౌడర్, గాలిలో కలిసి విషతుల్యంగా మారుతూ, సూక్ష్మ కణాలు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా, బ్రోన్కైటిస్, ప్రాణాంతకమైన సిలికోసిస్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి. కళ్ల మంటలు, చర్మ వ్యాధులతో ప్రజలు విలవిలలాడుతుంటే, ఆర్ అండ్ బి శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని ఈ కీలక పట్టణంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సేవ్ అశ్వారావుపేట అంటూ గతంలో జరిగిన ఉద్యమాలు ఏమయ్యాయి? ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నా, పాలకులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ​ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే మున్సిపల్ నేతలకు అభివృద్ధి పనులు గుర్తొస్తున్నాయా? ఓట్లు, సీట్ల పంపకాలపై ఉన్న శ్రద్ధ ప్రజల బాగోగులపై లేకపోవడం శోచనీయం. స్థానిక ఎమ్మెల్యే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప అధికారులతో పనులు చేయించడం, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కనీసం అజమహర్షి చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, చివరకు గచ్చేంతం లేక ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి దాపురించిందని ప్రజలు బాహటంగానే విమర్శిస్తున్నారు. పనులు పూర్తి చేయకుండా ప్రజలను దుమ్ము ధూళిలో ముంచడం నయవంచన కాదా? అని స్థానికులు నిలదీస్తున్నారు. ఇంకా ఎంతకాలం మేము ఈ కాలుష్యాన్ని మింగాలి? అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి, కాంట్రాక్టర్ల అక్రమాలకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని అశ్వారావుపేట ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి, రోడ్డు పనుల వద్ద నీటిని చల్లడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News