మెట్ల దారిన.. మొక్కుల దేవుని చెంతకు! శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి - భార్య మాధురితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
భార్య మాధురితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
పాల్వంచ:లోకల్ గైడ్ :
పాల్వంచ : ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీనివాసగిరి భక్తుల కోలాహలంతో నిండిపోయింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన తిరుకళ్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. కొండపై వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుక అత్యంత వైభవంగా సాగింది. ఈ పుణ్యకార్యంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన భార్య మాధురితో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ వేడుకలో అందరినీ ఆకట్టుకున్న ప్రధానాంశం మంత్రి పొంగులేటి దంపతుల రాక. . సామాన్యుడిలా భక్తుల 1,600 మెట్లను కాలినడకన ఎక్కుతూ గిరిశిఖరానికి చేరుకున్నారు. దారి పొడవునా గోవింద నామస్మరణ చేస్తూ, తనను పలకరించిన భక్తులకు చిరునవ్వుతో సమాధానమిస్తూ ముందుకు సాగారు. దేవుని దగ్గర అందరూ సమానమే అని ఆయన చాటిచెప్పారు.
లోక కల్యాణం కోసం ‘సిరి’ కల్యాణం..
ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ కమిటీ ఘనస్వాగతం పలికారు. స్వామివారికి మంత్రి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కళ్యాణ వేడుకను భక్తిశ్రద్ధలతో వీక్షించారు. పండితులు వారికి ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
పర్యాటక ప్రాంతంగా శ్రీనివాసగిరి..
దర్శనం తర్వాత మంత్రి మాట్లాడుతూ.. "ప్రకృతి ఒడిలో ఉన్న శ్రీనివాసగిరిని దర్శించుకోవడం నా అదృష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో ఈ క్షేత్రాన్ని గొప్ప ‘ఎకో టూరిజం’ (ప్రకృతి పర్యాటక) కేంద్రంగా తీర్చిదిద్దుతాం. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం" అని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నట్లు తెలిపారు.
