ఖేలో ఇండియా వేదికగా తెలంగాణకు కీర్తి తేవాలని మౌనిక లక్ష్యం
ఖేలో ఇండియా ట్రైబల్ రెజ్లింగ్‌కు మౌనిక ఎంపిక
ములుగు జిల్లా, ఏటూరునాగారం : లోకల్ గైడ్ :
ములుగు జిల్లా, ఏటూరు నాగారం మండలం, ముళ్లకట్ట గ్రామానికి చెందిన చేల మౌనిక ఖేలో ఇండియా ట్రైబల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్‌కు రాష్ట్ర జట్టు తరఫున ఎంపిక కావడం విశేషం. ఈ పోటీలు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ఫేజ్-2 ఖేలో ఇండియా ట్రైబల్ రెజ్లింగ్ జట్ల ఎంపిక పోటీల్లో మౌనిక ప్రతిభ కనబరిచి, పలు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో పోటీ పడుతూ నాలుగో స్థానంలో నిలిచి ఈ ఛాంపియన్షిప్‌కు అర్హత సాధించారు. ఆమె ప్రస్తుతం రెజ్లింగ్ కోచ్ అశోక్ కుమార్ వద్ద శిక్షణ పొందుతున్నారు.
మౌనిక గతంలో ఆల్ ఇండియా యూనివర్సిటీ, ఫెడరేషన్ కప్, సీనియర్ నేషనల్ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చూపుతూ పలు బహుమతులు, పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న మౌనికకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందితే తెలంగాణ రాష్ట్రానికి, ములుగు జిల్లాకు మరింత పేరు తీసుకువస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మౌనిక సాధనపై పలువురు రాజకీయ నాయకులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను చరవాణి ద్వారా అభినందించారు.
