హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.
ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్
లోకల్ గైడ్ హైదరాబాద్
హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఉదయం 6 గంటల బదులుగా 4:30 గంటలకే మెట్రో సేవలను ప్రారంభించాలని కోరారు.
ఈ మేరకు రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి పంపిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ వినతిని ఆర్‌పీఐ (ఆత్వాలే) పార్టీ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలపై భారంగా మారినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఇంధన పొదుపు మరియు ప్రజా రవాణా వినియోగం పెంపు అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటల నుండి 6 గంటల మధ్య సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్), చర్లపల్లి టెర్మినల్ వంటి స్టేషన్లకు 20కు పైగా సుదూర రైళ్లు చేరుకుంటున్నాయని తెలిపారు. ఈ సమయంలో దాదాపు 25,000 నుండి 30,000 మంది ప్రయాణికులు నగరానికి వస్తున్నారని వెల్లడించారు.
అయితే ప్రస్తుతం మెట్రో సేవలు ఉదయం 6 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుండటంతో, ప్రయాణికులు ఆటోలు, టాక్సీల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. అధిక చార్జీలు, వాహనాల లభ్యత సమస్యల కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 4:30 గంటలకే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చర్య వల్ల ఇంధన పొదుపు మాత్రమే కాకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు చౌకైన రవాణా అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ వినతిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
