సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో విజయ వంతంగా ముగిసింది. అన్ని కౌంటింగ్ కేంద్రాలలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసు కోకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి డబీల్‌పూర్ భారత్ బైబిల్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో, అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మజీద్‌పూర్ టీ శ్రీ చైతన్య స్కూల్‌లో కౌంటింగ్ నిర్వహించారు. అలాగే శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జెడ్పీహెచ్ఎస్ ఇస్నాపూర్ కౌంటింగ్ కేంద్రంలో గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి గడ్డపోతారం జెడ్పీహెచ్ఎస్ కౌంటింగ్ కేంద్రంలో ఇంద్రేశం మున్సిపాలిటీ కి సంబంధించి పెదకంజర్ల సోషల్ వెల్ఫేర్ స్కూల్ హాల్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అన్ని కేంద్రాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ నెల 16వ తేదీ వరకు అమలలో ఉంటుందని అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బందోబస్తు విధులలో నిబద్ధతతో పనిచేసిన పోలీస్ సిబ్బందిని సీపీ డాక్టర్ ఎం.రమేష్ అభినందించారు. ఎన్నికల ప్రక్రియను శాంతి యుతంగా పూర్తి చేయడంలో పోలీసుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.