వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
వన్ టౌన్ సిఐ కె శ్రీనివాసరావు.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు అరికట్టడానికి వన్ టౌన్ సిఐ కె శ్రీనివాసరావు పోలీసు సిబ్బందితో ఆటో మైక్ సిస్టంతో ప్రజలందరికీ అర్థమయ్యేలా బుధవారం బహిరంగంగా చాటింపు వేశారు.వేసవి సెలవులు సమీపిస్తున్నందున పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ తమ పోలీసు సిబ్బందితో వినూత్న కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఇటీవల వరసగా చైన్ స్నాచింగ్ దొంగతనాలు జరుగుతున్నాయని,వేసవి సెలవులు సమీపస్తున్నందున పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఇటీవల కాలంలో పెద్దపల్లి,లక్షెటిపేటలో జరిగిన చైన్ స్నాచింగ్ లను దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.బెల్లంపల్లి పట్టణంలో రైల్వే స్టేషన్ ఉన్నందున ఇతర రాష్ట్రాల నుండి కూడా దొంగలు రావడానికి ఆస్కారం ఉందన్నారు.అందుకే పట్టణ ప్రజలు అశ్రద్ధ చేయకుండా ఎవరైనా వేసవి సెలవులలో ఇల్లు వదిలి వెళ్లే ముందు ఇంటికి జాగ్రత్తగా తాళం వేసి వెళ్లాలన్నారు,తాళం వేసినట్లుగా కనపడకుండా కర్తన్ తో కవర్ చేయాలని,అదేవిధంగా ఎల్లవేళలా లైట్లు వెలిగేలా చూసుకోవాలని సూచించారు.ఇళ్ళు వదిలి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు కూడా సంబంధిత ఇండ్లలో ఎలాంటి దొంగతనాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు.ఇటీవల కాలంలో బంగారు ఆభరణాల దొంగతనం ఎక్కువగా నమోదవుతున్నందున ముఖ్యంగా మహిళలు బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ బంగారు ఆభరణాలు ధరించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.ఊరు వెళ్లే ముందు విలువైన బంగారు ఆభరణాలు డబ్బులు ఇంట్లో ఉండకుండా చూసుకోవాలని,బంగారు ఆభరణాలను బ్యాంకు లాకర్ లలో దాచుకోవాలని,ఇంటి చుట్టు పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.పట్టణ ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చిన డయల్ 100కు కాల్ చేయాలని కోరారు.
