లోకల్ గైడ్ షాద్ నగర్.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు, అభివృద్ధి పథంలో తెలంగాణ రాష్ట్రాన్ని నడిపి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తీర్చిదిద్దిన ఘనుడు, మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ కొనియాడారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని షాద్ నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడంతో పాటు దశాబ్ద కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో తీర్చిదిద్ది, దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసిన మహనీయుడు, గొప్ప పరిపాలకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, హరితహారం, కేసిఆర్ కిట్లు, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలకు అండగా ఉన్నారని అన్నారు. అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచిన నేటికీ కేసీఆర్ ని తలచుకుంటున్నారని, ఆయన పాలన తీరును మర్చిపోలేకపోతున్నారని చెప్పారు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్లు బ్రతికి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులకు, అభిమానులకు తినిపించారు. కార్యాలయం ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. మహిళా కార్యకర్తలు సైతం ఉత్సాహంగా పాల్గొని కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం కార్యాలయావరణంలో మొక్కలను నాటారు. షాద్ నగర్ సర్కార్ దవాఖానాలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు. కేసీఆర్ జన్మదినo ఓ పండుగ వాతావరణాన్ని తలపించిందని పలువురు నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకాయల నారాయణరెడ్డి, ఆకుల శ్రీశైలం, మాజీ కార్పోరేషన్ చైర్మన్ రాజవరప్రసాద్, రాజ్యలక్ష్మి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, పట్టణ అధ్యక్షులు ఎం. ఎస్. నటరాజన్, నియోజకవర్గంలోని ప్రధాన ప్రముఖ నేతలు, కార్యకర్తలు, నూతన కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.