శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాతృశ్రీ నగర్ డివిజన్‌లో శానిటేషన్ పరిస్థితులు దయనీయంగా మారాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వంద రోజుల ప్రోగ్రాం” ద్వారా అభివృద్ధి జరుగుతోందని ప్రచారం చేస్తున్నప్పటికీ, స్థానిక స్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాతృశ్రీ నగర్ కాలనీలో ప్లాట్ నంబర్ 402 ఇంటి ముందు రోడ్డుపై గత నాలుగు రోజులుగా డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. దుర్వాసనతో పాటు దోమలు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించి నప్పటికీ, ఫీల్డ్ స్థాయి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడం దురదృష్టకరమని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన స్థానిక నాయకుడు మిద్దెల మల్లారెడ్డి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రజల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ స్థాయిలో మంచి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, అవి ఫీల్డ్ స్థాయిలో సమర్థవంతంగా అమలు కాకపోవడం వల్ల ప్రజలకు ప్రయోజనం అందడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, స్పందనలో ఆలస్యం వంటి కారణాల వల్ల ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయి. తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం అత్యవసరం.