ఖమ్మం జిల్లా, కారేపల్లి: లోకల్ గైడ్, ఫిబ్రవరి 1 :
సింగరేణి మండలం, గుంపెళ్ల గూడెం గ్రామ పంచాయతీకి చెందిన సీమ సురక్ష బల్ జవాన్ దారావత్ వీరు దేశ రక్షణలో తన జీవితాన్ని అంకితం చేసి, సేవా త్యాగాలకు ప్రతీకగా నిలుస్తున్నారు. సరిహద్దుల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ, ప్రాణాల్ని పణంగా పెట్టి మాతృభూమి భద్రతకై నిత్యం అప్రమత్తంగా ఉండే జవాన్ వీరు నిజమైన దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు.వీధి స్థాయిలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన అందించిన నిష్ఠావంతమైన సేవలకు గుర్తింపుగా ప్రశంస పత్రం మరియు ప్రత్యేక పురస్కారం అందజేయడం గుంపెళ్ల గూడెం గ్రామానికి గర్వకారణంగా మారింది. విధి నిర్వహణలో చూపిన క్రమశిక్షణ, సమయపాలన, ప్రజల పట్ల ఉన్న సేవాభావం ప్రతి పౌరుడికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కృష్ణ వేణి మాట్లాడుతూ,దేశం కోసం తన సుఖసౌఖ్యాలను త్యజించి, సరిహద్దుల్లో కాపలా కాస్తున్న మా గ్రామ కుమారుడు దారావత్ వీరు గుంపెళ్ల గూడెం గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటుతున్నారు. ఆయన సేవలు యువతకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు.అలాగే గ్రామ ఉద్యోగ సంఘ ప్రతినిధులు గుగులోత్ శంకర్, బానోత్ వీరన్న, బానోత్ రమేష్ (ఆర్మీ) మాట్లాడుతూ, దేశ రక్షణతో పాటు ప్రజా రక్షణలోనూ జవాన్ వీరు చూపుతున్న అంకితభావం ప్రశంసనీయం అని అన్నారు. గ్రామ పెద్దలు గుగులోత్ వీర బాబు, లకావత్ రాము మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.సమాజంలో శాంతి, భద్రతలు నిలవాలంటే సైనికుల త్యాగాలు మూలస్తంభాలని పలువురు వ్యాఖ్యానించారు. మంచు కొండలు, ఎడారులు, అరణ్యాలు అనే తేడా లేకుండా మైనస్ డిగ్రీల చలిలోనూ, మండే ఎండల్లోనూ దేశ పతాకం రెపరెపలాడేందుకు తమ జీవితాలను అర్పిస్తున్న జవాన్ల సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని జవాన్ దారావత్ వీరుకు ఘనంగా అభినందనలు తెలిపారు.దేశం పిలిస్తే ప్రాణం అర్పించడానికైనా సిద్ధమే అన్న సంకల్పాన్ని తన సేవల ద్వారా చాటుతున్న దారావత్ వీరు గుంపెళ్ల గూడెం గ్రామానికి మాత్రమే కాదు సమస్త తెలంగాణకే గర్వకారణంగా నిలుస్తున్నారు.దేశం కోసం జీవించే జవాన్లే నిజమైన నాయకులు దేశభక్తే వారి ఆయుధం త్యాగమే వారి శ్వాస.