తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)
బోయగల్లి ప్రాంతంలో జరిగిన కుటుంబ వివాదంలో తమ్ముడి మృతికి కారణమైన అన్నను, అతని భార్యను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బోయగల్లి ప్రాంతానికి చెందిన వంగలి రాములు, వంగలి ప్రభు, వంగలి కొండలు ముగ్గురు అన్నదమ్ములు. వారికి సంబంధించిన పాత ఇంటి విషయంలో వివాదం నెలకొంది. ఆ ఇంటిని వంగలి కొండలు తీసుకుని మిగతా ఇద్దరికీ డబ్బులు చెల్లించినప్పటికీ, ఆ ఇంటిని తన పేరుపై మార్చేందుకు అవసరమైన సంతకం చేయకుండా వంగలి రాములు వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా వారి అమ్మమ్మకు చెందిన 60 గజాల భూమిని ఎవరికి తెలియకుండా వంగలి రాములు తన భార్య చంద్రకళ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ప్రశ్నించిన వంగలి కొండలను రాములు మరియు అతని భార్య చంద్రకళ తిట్టి అవమానించినట్లు సమాచారం.
ఈ అవమానాన్ని భరించలేక వంగలి కొండలు 15-06-2026న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు మొదట సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 26-02-2026న ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుని రెండవ అన్న వంగలి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు. ఈ కేసులో నిందితులైన వంగలి రాములు మరియు అతని భార్య చంద్రకళను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
