ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించడమే లక్ష్యం.
గద్వాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్.
గద్వాల, లోకల్ గైడ్ :
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందించడమే లక్ష్యంగా జోగులాంబ గద్వాల జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం రూపుది ద్దుకోవడానికి భారతరత్న డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపొందించి 1950 జనవరి 26న అమలులోకి తీసుకువచ్చి, దేశాన్ని గణతంత్ర దేశంగా మార్చారని తెలిపారు. భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించేందుకు కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర సమర యోధులు, అమరవీరులు, రాజ్యాంగ నిర్మాతలకు జోహార్లు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటిదాకా జిల్లాలో 2,61,46,000 మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి, రూ.99.14 కోట్లు విలువైన లబ్ది పొందినట్లు తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో 13,450 మందికి వైద్య సేవలు అందించామని, దీనికి రూ.36.87 కోట్లు వ్యయం చేయడం జరిగిందన్నారు. తెలంగాణలో రైతు పంట ఋణమాఫీ పథకంను 18.07.2024న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 58,113 రైతులకు సంబంధించిన పంట ఋణాలు రూ.513.99 కోట్లు మాఫీ చేయబడ్డాయని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.12,000 చొప్పున రైతులకు పంటలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోందన్నారు. జిల్లాలో 1,69,299 రైతులకు రూ.268.84 కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయినట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి వానాకాలంలో 86 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా 14,200 రైతుల నుంచి 97,165 మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి, రూ.232.13 కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ కింద 29.50 కోట్లు జమ చేశామని తెలిపారు. జిల్లాలో 1 లక్ష 87 వేల 327 రేషన్ కార్డుదారులకు, 6,65,317 మంది సభ్యులకు జనవరి 2026లో 4,174 టన్నుల సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయబడిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించ బడిందని, జిల్లాలో ఇప్పటివరకు 6,405 ఇండ్లు మంజూరు చేయబడగా, 43 ఇండ్లు పూర్తయ్యాయని, మిగతా ఇండ్లు వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఇంటికి ఉచిత వెలుగులు అందజేయడం జరుగుతోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 86,243 ఇండ్లకు లబ్ధి చేకూరగా, రూ.2.01 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. మహాలక్ష్మీ పథకంలోని 500 రూపాయలకే వంట గ్యాస్ ద్వారా జిల్లాలో 95,857 మంది లబ్ధి పొందారన్నారు. ఈ పథకానికి ప్రభుత్వం రూ.8.02 కోట్ల సబ్సిడీ అందించినట్లు తెలిపారు. తెలంగాణలో ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు, యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అందిస్తోందని తెలిపారు. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా గద్వాల బాల భవన్, వివిధ పాఠశాలల చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తూ ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్, ఇతర అతిధులు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.208.87 కోట్ల విలువైన బ్యాంకు రుణాల చెక్కును అందజేశారు. ఎన్జిసి (నేషనల్ గ్రీన్ కోర్) ఆధ్వర్యంలో గ తేడాది నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ కాంపిటీషన్ నిర్వహించగా జిల్లాలోని ధరూర్ జెడ్పిహెచ్ఎస్, గద్వాల ప్రభుత్వ బాలుర, ప్రాక్టీసింగ్, విశ్వేశ్వరయ్య పాఠశాలల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నందుకు సంబంధిత డైరెక్టర్ నుంచి పంపించిన ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు అందజేశారు. అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిధులు బహుమతులు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
