పెద్దేముల్ ఠాణాలో ఎస్సైలు ఎందుకు నిలవడం లేదు?
మూడు సంవత్సరాల్లో వరుస బదిలీలు
రాజకీయ ఒత్తిడులా? ఉన్నతాధికారుల అసంతృప్తి కారణమా? పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఆందోళన.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు స్థిరంగా ఎందుకు నిలవడం లేదు అని పలువురు చర్చించుకుంటున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎస్సైలు స్థిరంగా కొనసాగలేకపోవడం చర్చనీయాంశమైంది.ఒక అధికారి కనీసం ఆరు నెలలు కూడా విధుల్లో కొనసాగని పరిస్థితి నెలకొనడంతో పోలీస్ వ్యవస్థలో నిరంతరత లోపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు.
వరుస బదిలీలకు రాజకీయ ఒత్తిళ్లే కారణమా? లేక ఉన్నతాధికారుల అసంతృప్తి కారణమా? అన్నదానిపై స్పష్టత లేకపోయినా, తరచూ అధికారుల మార్పులు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. కేసుల దర్యాప్తు, ఫిర్యాదుల పరిష్కారం, స్థానిక పరిస్థితుల అవగాహన వంటి అంశాల్లో ఇది ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజా భద్రత దృష్ట్యా పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో స్థిరత్వం తీసుకురావాలని స్థానికులు, సామాజిక వర్గాలు కోరుతున్నాయి.
పరిపాలనా నియంత్రణ నుంచి బదిలీల వరకు విస్తరించిన అధికారాలు
పోలీస్ వ్యవస్థలో సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) స్థాయి అధికారి కీలక పాత్ర పోషిస్తాడు. పోలీస్ స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, చట్టవ్యవస్థ పరిరక్షణ వంటి బాధ్యతలు ఎస్సై భుజాలపై ఉంటాయి. అయితే ఈ స్థాయి అధికారిపై ఉన్నతాధికారుల ప్రభావం గణనీయంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎస్సైలు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ), డీఎస్పీ,ఎస్పీ వంటి ఉన్నతాధికారుల ఆధీనంలో పనిచేస్తారు. రోజువారీ పనితీరుపై పర్యవేక్షణ, కేసుల పురోగతిపై సమీక్షలు, స్టేషన్ నిర్వహణపై సూచనలు వంటి అంశాల్లో ఉన్నతాధికారుల నియంత్రణ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన కేసులు, లా & ఆర్డర్ పరిస్థితుల సమయంలో దర్యాప్తు దిశనిర్దేశం కూడా పై అధికారుల నుంచే వస్తుంది.
బదిలీలు, పోస్టింగ్‌లు కూడా ఉన్నతాధికారుల సిఫారసుల ఆధారంగా నిర్ణయించబడుతాయి. ఒక ఎస్సై ఏ ప్రాంతంలో ఎంతకాలం పనిచేయాలన్నది పరిపాలనా నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. తరచూ బదిలీలు జరిగితే పనిలో నిరంతరత దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అదేవిధంగా, పనితీరు మూల్యాంకనం, ప్రమోషన్ అవకాశాలు కూడా ఉన్నతాధికారుల అభిప్రాయాలపై ఆధారపడతాయి. క్రమశిక్షణ చర్యలు, మెమోలు, సస్పెన్షన్ వంటి అంశాలు కూడా పై స్థాయి అధికారుల పరిధిలోనే ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో రాజకీయ లేదా పరిపాలనా ఒత్తిళ్లు ఉన్నతాధికారుల ద్వారా దిగువ అధికారులపై ప్రభావం చూపుతాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఇవి వ్యవస్థపరమైన నియమావళి ప్రకారమే జరుగుతాయని పోలీసులు చెబుతుంటారు.
మొత్తానికి, ఎస్సై స్థాయిలో పనిచేసే అధికారుల పనితీరు, స్థిరత్వం, కెరీర్ పురోగతి వంటి అంశాలు ఉన్నతాధికారుల నిర్ణయాలతో ముడిపడి ఉంటాయి. సానుకూల మార్గనిర్దేశం, సమన్వయం ఉంటే పోలీస్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*వరుస బదిలీలతో వ్యవస్థ పై ప్రభావం!*
తక్కువ కాలంలో వరుస బదిలీలు
పెద్దేముల్ పోలీస్ స్టేషన్ చర్చనీయాంశమైంది. గత మూడు సంవత్సరాల వ్యవధిలో వరుసగా సుమారు 10 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్‌లు (ఎస్సైలు) బదిలీ కావడం స్థానిక ప్రజల మరియు పోలీస్ వ్యవస్థలో ఆందోళనకు కారణమైంది. తక్కువ కాలంలో అధికారులు తరచూ మారడం వల్ల స్టేషన్ లోపలి పరిపాలన, కేసుల దర్యాప్తు, ప్రజల విశ్వాసం మరియు సిబ్బందిపై గణనీయమైన ప్రభావం కనిపిస్తోంది. ముఖ్యంగా
ఒక ఎస్సై ప్రారంభించిన ప్రణాళికలు, విధానాలు, పనితీరును తరువాతి అధికారి కొనసాగించలేకపోవడం వల్ల నిర్ణయాల్లో స్థిరత్వం తగ్గుతుంది. దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతాయి.స్టేషన్ నిర్వహణలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది.అదేవిధంగా కేసుల దర్యాప్తులో ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒక
కొత్త ఎస్సై ప్రాంతీయ సమస్యలను పూర్తిగా అర్థం చేసుకునే వరకు, ప్రారంభించిన కేసులపై ఫాలోఅప్ ఆలస్యమవుతుంది. సాక్ష్యాలు, ప్రామాణిక ఆధారాల పర్యవేక్షణలో అంతరాయం ఉండవచ్చు. దాంతో కేసుల పరిష్కారం నెమ్మదిగా జరుగుతుంది.వీటితోపాటు ప్రజల విశ్వాసం తగ్గడం,
ప్రజలు ఒక అధికారితో స్థిరమైన సంబంధం ఏర్పరచి సమస్యలను వివరించాలనుకుంటారు. ఈ విధంగాఎప్పటికప్పుడు అధికారులు మారితే ప్రజలలో “ఇక్కడ ఎవరూ నిలవరు” అన్న భావన కలుగుతుంది. ఫిర్యాదుల నివేదికలు తగ్గడం, పోలీస్,ప్రజల సంబంధాలు బలహీనపడడం వంటి సమస్యలు చోటు చేసుకుంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా
ప్రతి ప్రాంతానికి ప్రత్యేక సామాజిక, రాజకీయ మరియు భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. కొత్తగా వచ్చిన ఎస్సైకి ఈ పరిజ్ఞానం అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది.దాంతో సున్నితమైన సమస్యల పరిష్కారంలో లోపం ఏర్పడుతుంది.అదేవిధంగా స్థిరమైన నాయకత్వం లేకపోవడం వల్ల సిబ్బందిపై మానసిక ప్రభావం, పని ఒత్తిడి పెరుగుతుంది. అంతర్గత సమన్వయం దెబ్బతింటుంది. ఉద్యోగ సంతృప్తి తగ్గుతుంది. అయితే
తక్కువ కాలంలో బదిలీలు, మార్పులు ఉంటే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంటే లావాదేవీలు, స్థానికులతో సంబంధాలు, అధికార దుర్వినియోగం వంటి వాటిని నియంత్రించవచ్చు అనే కోణంలో కూడా పోలీస్ శాఖ పనిచేస్తుంది అని విశ్లేషకుల వాదన.
