సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను వంద శాతం సాధించాలి.
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
గద్వాల, లోకల్ గైడ్ :
ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాంలో నిర్దేశించిన సంపూర్ణత అభియాన్ లక్ష్యాలను వంద శాతం చేరుకునేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ పిలుపునిచ్చారు. నీతి అయోగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం లో భాగంగా బుధవారం ఢిల్లీ నుంచి నీతి అయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కు ఎంపికైన దేశంలోని 112 జిల్లాలలోని 513 బ్లాక్ లకు చెందిన ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమం ఈనెల 28 నుంచి ఏప్రిల్ 14 వరకు మొత్తం 77 రోజులపాటు కొనసాగు తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా బ్లాక్ లకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకుగాను అధికారులు గ్రామస్థాయి సర్పంచుల నుంచి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల వరకు అందరి సహకారం తీసుకొని ముందుకెళ్లాలన్నారు. జిల్లాలోని గట్టు మండలం ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కు ఎంపికవడంతో ఐడీఓసీలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో 6 నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అందజేస్తున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ చేసేలా సంబంధిత అధికారులు తరచూ కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు. మరుగుదొడ్లు లేని అంగన్వాడి కేంద్రాల్లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమైనన్ని టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలన్నారు. పశువులకు టీకాల విషయంలోనూ 100శాతం లక్ష్యాలను సాధించేలా పనిచేయాలని పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీఈవో విజయలక్ష్మి, గట్టు మండలం ఎంపీడీవో చెన్నయ్య, ఐసిడిఎస్ సిడిపిఓ హేమలత, పిఆర్ ఏఈ రాజ్ కుమార్, డా. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
