మిర్యాలగూడ మార్చి 18
(లోకల్ గైడ్ తెలంగాణ )
భూస్వామ్య కుటుంబంలో పుట్టినా పీడిత ప్రజల కొరకు అహర్నిశలు పోరాటాలు చేసిన వీరవనిత మల్లు స్వరాజ్యం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మల్లు స్వరా జ్యం నాలుగో వర్ధంతి సందర్భంగా స్థానిక సిపిఎం కార్యాలయంలో సభ జరిగింది. మొదట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ భూమి కోసం భు త్తి కోసం మానవాళి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె నిజాముకు రజాకార్లకు భూస్వాములకు వ్యతిరేకంగా తుపాకీ పట్టి పోరాటాలు చేసి పేదలకు భూ పంపిణీ చేసిన ఘనత వారికి దక్కిందన్నారు. వారు సల్పిన పోరాటం ఫలితంగానే 10 లక్షల ఎకరాలు పేదలకు పంచడం జరిగిందని వెట్టిచాకిరిని రద్దు చేయించారని అలాంటి పోరాటాలు మరువలేని నేటి యువతకు ఆదర్శమని ఆయన అన్నారు. ఎత్తిన జెండాను దించకుండా ఆ జెండా దేశవ్యాప్తంగా రెపరెపలాడాలని ఆశించిన రోజు రావ ని అన్నారు. ప్రపంచ సంపదను కొందరికే దోచుకోవడం కోసం ఈనాటి పాలకులు పెట్టుబడిదారులకు గులా గిరి చేస్తున్నారని అలాంటి పాలకులను పారదోలి పేదలకు న్యాయం చేయాలన్నది ఆమె ఆశయమని వివరించారు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం మార్క్సిజమేనని ఆ సిద్ధాంతం వల్లనే మానవాళికి విముక్తి అని తెలిపారు. మతాల పేరుతో ఈనాటి మతోన్మాదులు చేస్తున్న కుట్రలను వారి రెచ్చగొట్టే ప్రసంగాలను యువత వినకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె ఆశించారన్నారు. తుది శ్వాస వరకు ఆమె పోరాటాలు చేసిందని ఆ పోరాటాలు సఫలీకృతం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు జిల్లా కమిటీ సభ్యులు మంగారెడ్డి, పట్టణ కార్యదర్శులు గౌతమ్ రెడ్డి భావండ్ల పాండు జగదీష్ చంద్ర పాల్గొన్నారు.