అశ్వారావుపేట లోకల్ గైడ్ :
న్యాయవాదులపై జరుగుతున్న వరుస దాడులు, దారుణ హత్యలను నిరసిస్తూ దమ్మపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు ఉధృతమయ్యాయి. మంగళవారం ఈ దీక్షా శిబిరాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సందర్శించి, న్యాయవాదులకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. దీక్షలో కూర్చున్న న్యాయవాదులతో మాట్లాడి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల న్యాయవాదులను అత్యంత దుర్మార్గంగా హత్య చేసిన హంతకులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయవాదులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు.న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని, ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు నిర్భయంగా తమ విధులను నిర్వర్తించేలా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. న్యాయవాదులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెచ్చా నాగేశ్వరరావు వెంట బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.