సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి16:గురుకుల విద్యాలయాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలో మెనూ అమలు, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హైమవతి హెచ్చరించారు.సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసినప్పుడు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం సరైన పరిమాణంలో విద్యార్థులకు అందించకపోవడం, వంటగదులు మరియు స్టోర్ రూముల్లో పరిశుభ్రత లోపించడం గమనించామని తెలిపారు. మండల స్థాయి అధికారులు ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన సమయంలో హాస్టళ్లను తనిఖీ చేసి విద్యార్థులకు సరైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలోని పోస్ట్ మెట్రిక్ బీసీ బాలికల హాస్టల్ మరియు ఎస్సీ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు వంటగదులు, స్టోర్ రూములు అపరిశుభ్రంగా ఉన్నట్లు గమనించానని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోస్ట్ మెట్రిక్ బీసీ బాలికల హాస్టల్ సంక్షేమ అధికారిని సస్పెండ్ చేయాలని, వాచ్‌మెన్ మరియు వంట మనిషిని విధుల నుంచి తొలగించాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఆదేశించారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అన్ని శాఖల అధికారులు ప్రతిరోజూ ఫోటోలతో సహా వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని, గ్యాస్ కృత్రిమ కొరత రాకుండా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, జిల్లా కేంద్రంలో జిల్లా జైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అధికారులు సిద్ధం కావాలని సూచించారు.ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి స్వచ్ఛతపై మిషన్ భగీరథ అధికారులు డెమో నిర్వహించి, ఆర్ఓ నీరు మరియు బోర్ నీటితో పోలిస్తే మిషన్ భగీరథ నీరు ఎలా శుద్ధమైనదో వివరించారు. ప్రజల్లో మిషన్ భగీరథ నీరు త్రాగేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.