శివరాత్రికీ ముస్తాబ్ భౌతున్న కోటిలింగాల
-జాతరకు ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్
ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 11 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ కోటిలింగాల జాతర సందర్భంగా భక్తుల రాకపోకలు భారీగా ఉండనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. మండల పంచాయతీ అధికారి మల్లెల రవీందర్ ప్రసాద్, పోలంపల్లి సర్పంచ్ హేమలత ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్య చర్యలు, వీధి దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.భక్తుల సౌకర్యార్థం వైద్య శిబిరం, అంబులెన్స్ సదుపాయం, అత్యవసర సహాయ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సేవకులను నియమించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక శుభ్రత బృందాలను ఏర్పాటు చేశారు. భక్తులు క్రమశిక్షణగా వ్యవహరించి అధికారులకు సహకరించాలని అధికారు లు కోరారు. జాతర విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆలెం వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ కార్యదర్శి నెహ్రు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
