అశ్వారావుపేట, లోకల్ గైడ్ :
మండలంలోని వేదాంతపురం గ్రామపంచాయతీ పరిధిలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎన్పీడీసీఎల్ అధికారులు సానుకూలంగా స్పందించారు. బుధవారం గ్రామ సర్పంచ్ తోట వెంకటమ్మ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల బృందం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, లో-వోల్టేజ్ సమస్యలు మరియు పాతబడిన విద్యుత్ తీగలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వ్యవసాయం మరియు గృహ అవసరాలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. సర్పంచ్ విన్నపంపై ఏఈ సానుకూలంగా స్పందించారు. గ్రామ పరిధిలోని విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత లైన్ ఇన్‌స్పెక్టర్ మరియు సిబ్బందిని ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధుల కోసం వెంటనే ఎస్టిమేట్లు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. తద్వారా త్వరలోనే పనులు ప్రారంభించి గ్రామానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట వెంకటమ్మతో పాటు మాజీ సర్పంచ్ సోమిని శివ శంకర ప్రసాద్, ఉపసర్పంచ్ సంగీత వీర్రాజు పాల్గొన్నారు. అలాగే వార్డు సభ్యులు గణప వెంకటలక్ష్మి, గడ్డం మహాలక్ష్మి, తోట వెంకటస్వామి, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల చొరవతో విద్యుత్ సమస్యలు తీరనుండటంతో వేదాంతపురం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.